ఋతువుల చిత్రం


సూరీడు ఆకాశాన్ని ముద్దాడకముందే 
వర్షం ఆర్ద్రతయై  భూమిని  తాకింది 
సూరీడు ఆకాశ బొడ్డున వడ్డాణమై మెరుస్తుంటే 
ఎండా చుర్రున భూమిని ఆవరించింది 
ఆకాశ గంగలో సూర్యుని మునక చూసి 
చలి ఆర్తిగా భూమిని హత్తుకుంది
ఇదేమి వింతో 
ఒక్క రోజులో, ఎన్ని ఋతువులో?   
     

కవిత్వ ఒరవడి


ప్రపంచం ఒక పద్మవ్యూహం అయితే  
కవిత్వమే అస్త్రం 
ఓటమి గెలుపుల జీవితానికి 
కవిత్వమే పాంచజన్యం .
గుండెకార్చే కన్నీటికి
కవిత్వమే ఓదార్పు హస్తం 
కలాన్నిసందించు .
కాలాన్నిఎదిరించు.   

బాల్యం


పలక పై గీసుకున్న 
పిచ్చిగీత కాకూడదు
అందమైన అక్షరమై 
శాశ్వతముగా నిలవాలి 


పాలబుగ్గల పసి ప్రాయం 
చిరునవ్వులు చిందించాలి 
లేలేత చేతులు 
కళలను ఆడించాలి 


బాల్యం భవిష్యానికి
తీపి గుర్తు  కావాలి 
అలకలు అల్లరులూ 
జ్ఞ్యాపికగా మిగలాలి

బాల్యంలోనే మంచిని 
మొగ్గలోనే  చిదిమేస్తే 
భావితరాలకింక 
అరాచకమే మిగులుతుంది.   

మరో మహాత్మ



చాన్నాళ్ళకి ఓ వార్త
అసంభవం అనుకున్న
అవినీతిని మై పూత ను
కరిగించే శంఖారావమైంది
నీరసించిన ప్రజాస్వామ్యం లో
చైతన్య ప్రభంజనం  తెచ్చింది
దొరతనం దొంగతనానికి అలవాటై
డొక్కల్ని పిండుకుంటున్న రాక్షసత్వం
ఒకడు కొండచిలువల్ని మింగితే
మరొకడు వానపాములైన మేలే
అన్నతీరుపై యువకెరటం ఎగిసింది
చట్టాలే మన ఆయుదాలని
వేల చేతుల్ని ఒక్కటి చేసి
సత్యాగ్రహి కొరడా ఝులిపించిన
ఓ ఋషీ, మరోమహాత్మా
అన్నా హజారే మీకు జేజేలు   

చెమట చినుకు

సెల్లో కోకిల పాట 
బోన్సాయి  మామిడి పూత 
కాటరింగ్  పిండి వంటల కమ్మదనం 
రాతిరి సీసాలో చేదు అమృతం
చలువ కళ్ళ లోగిళ్ళలో 
నిత్య ఉగాది 
హోటల్ బోజనంలో 
అమ్మ చేతి గుర్తులను వెతుక్కుంటూ 
ఫ్రిజ్ లో కూల్డ్రింక్ కేం తెలుసు 
కొత్త కుండలో ఉగాది పచ్చడి రుచి
ప్లాస్టిక్ మనుషులకేం తెలుసు
అర్ర లో కాగుల వాసన 
పెద్దిల్లకు తెలిసిందల్లా 
నోటే నోటి కాడి ముద్ద
గుడిసనే తన బ్రతుకుకు పునాదని 
మరచిన భవనం విర్రవీగినట్టు 

మట్టిబెడ్డను  వెన్నేముద్దగా మార్చే
కాళ్ళు పల్లేరు లైతేనే
ప్రకృతి పల్లవాల పూత అడ్డుకునేది 
చెమట చినుకులో తడిస్తేనే
మట్టి పాలకంకై విచ్చుకునీది 
అలసిన మరిపించిన కూనిరాగమే 
జానపద జావళియై
కూకిలమ్మకు పాట నేర్పింది
నాకు కవిత్వ మిచ్చింది 
ఏ భేషజాలు లేని నా పల్లె తల్లి 
మట్టి కుండై, వెదురు గంపై
నాగలి కర్రై , పాడి ఆవు దూడై
కష్టాల చేదును మింగుతూ 
సుఖాల తీపిని జగతికి పంచేది 
ప్రపంచం పారిశ్రామికీకరణ 
పండగ దండిగా చెసుకుంటుంటే
పల్లె గడిచిన ఉగాదులను
తలపోసుకుంటున్నది 
నింగిలో చిక్కుకుపోయిన చూపుల్ని 
నేలమ్మకు  పొదుగు దారి
పచ్చని పట్టుచీరను 
ప్రకృతికి సారే గా ఇద్దాం 
పల్లెమ్మ ఇంట 
నిత్య వసంత ఉగాదిని తెద్దాం