గ్రీష్మపు హేమంతం




ఒక్క బింబం నుండి 
అనేక ప్రతి బింబాలుగా ఉదయిస్తూ 
ప్రతి ప్రతిబింబానికి మనసును నిర్మిస్తూ 
సహస్త్ర బాహువులతో 
సాహస విన్యాసం చేయడం
అవసరాన్ని దాటి అలవాటె
ఇప్పుడు స్వభావం మారిపోయింది 
తరాల క్రిందట దోచుకోబడ్డ 
అహాన్ని పొరలు పొరలుగా పేర్చుకుంటూ  
వంగిన వ్యక్తిత్వపు నడకకు 
ఆసరాలను కూర్చుకుంటూ 
నింగికి పయనం కావడం 
అవసరాన్ని దాటి అలవాటై 
ఇప్పడు హక్కుగా మారిపోయింది 
నా,నీ భేదం లేకుండా చేసే గాయాలకు 
చిగుళ్ళను తోడుగుతూ 
కుసుమాలను అద్దుతూ స్వయం సంజీవనియై 
రేపటి  సామాజానికై అమృతత్వాన్నిమోస్తూ 
నిత్య, చేతన వసంతం కావడం 
అవసరాన్ని దాటి అలవాటై 
ఇప్పుడు ఆనవాయితీగా మారిపోయింది 
గ్రీష్మపు ఎదపై హేమంతాలు పొదగడం 
కుటుంబాన్ని సమాజాన్ని 
మునివేళ్ళ పట్టుకొని 
ముగ్గులా అల్లడం నీకు తెలుసు 
రెక్కలకు చుక్కలు అద్దుకొని ఎదగడం 
నెల దిగిన హరివిల్లై 
మొలకలకు వీళ్ళను కూర్చడం నీకు తెలుసు 
గాజుల సవ్వడి 
మానవత్వ విభేదానికి గుణపాటం వినిపించేలా 
చెయ్యెత్తి జై కొట్టు 
విజయోస్తు మహిళా. 

విలువలు తొడిగిన అక్షరం



పొట్ట చీరితే మట్టి తప్ప 
ఏమి లేని మట్టి బతుకు 
కలలను పండిద్దామని
పానాదెంట పరుసుకున్న 
పల్లేరుల్ని ఏరుకుంటూ 
చెమట పోసి పెంచిన 
ఎండల్ల వాన 
పెయ్యి పరిసి కాసుకున్న 
డొక్కల్లో బాయి తోడి 
నోటికి ముద్ద అందించిన 
అక్షరం కాపు కొచ్చింది 
అక్కున జేర్చుకుంటే 
మట్టంటుతదని సూసి మురిసిన 
అక్షరానికి రెక్కలచ్చినయి 
అవ్వోసొంటి పల్లె నిడిసి
పట్నం సాఫ్ట్ వేర్  పై వాలింది 
అక్షరం ఎచ్చని రెక్కల కింద 
ఉడిగిన వయసు 
సుఖపడుతదనుకొన్న 
దానికి సెంటు వాసనలే తప్ప 
చెమట వాసన గిట్టుతలేదు
కన్న మట్టి తల్లి నిడిసి 
పోరుగోని ఊడిగం మీద 
మోజు పెంచుకున్నది  
విలువలు లేని అక్షరానికి 
పాతేద్దమనుకున్న 
మట్టి మనసు ఒప్పలే 
గందుకే 
విలువల్ని నాటిన 
ఇప్పుడు విలువలు తొడిగిన  
అక్షరం అంకురించింది 

శాంతి శాంతి శాంతిః

నా సహచారి తప్పిపోయింది  
మీ రెవరైనా చూశారా
దాని సుశ్రావ్యమైన పలుకులు 
మీరెవరిన విన్నారా 
ఒకప్పుడది పచ్చని పంట పోలమై 
రైతును ఆప్యాయంగా స్పృశించేది 
ధర్మపరుల బుజాలేక్కి 
హృదయాన్ని తడిమేది
న్యాయచరుల పాదాలకు
పోలబాట పరిచేది 
సత్యానికి నాలుక తానై 
అహింసా రాగం తానై 
నిత్య ప్రసన్న ముఖార విందమై నర్తించేది 
పాపబోసి నవ్వై 
పడతి గాజుల సవ్వడై
 మనసు మందిరం లో దివ్వెలా వెలిగేది 
కంటి కొలనులో ముత్తేమై మెరిసేది 
నట్టింట కవ్వమై 
పల్లె నడిబొడ్డు యాప చెట్టు అరుగై 
ఇక్యరాగం అల్లపించేది 
మువన్నెల జెండా శ్వేత వర్ణమై 
సమైక్య రాగానికి పల్లవై
శాంతిని వెదజల్లేది
ఇప్పుడది కనిపించడం లేదు 
బీడు భూముల్ని చూసి తల్లడిల్లిందో 
నట్టింటి కలహాలకి కలత చెందిందో 
నడిరోడ్డు లో ఓడిన రక్తానికి కన్నీరైందో 
మెదళ్ళలో పాకురు పట్టిన 
రాజకీయానికి భీతిచెందిందో 
ఫైళ్ళ లో పేరుకు పోయిన
కుంభ కోణాల గల్లనికి చిక్కిందో 
ఎక్కడుందో నా సహచరి 
మీరెవరైనా చూశారా
మీకు కనిపిస్తే ప్రేమగా నిమిరి 
మానవత్వపు గింజలు తినిపించండి 
బద్రంగా నా ఇంటి నాకిట 
అప్పజెప్పండి 
నా శాంతి కపోతాన్ని నేను 
నా తరువాత తరాలకు  
అందిస్తాను  .......... 

సురుటి సుక్క

సనుబాల అరువు 
నా ఇంటి తీనేల అరుగు 
సెలక శీను  దున్ను తల పాగా 
పాలే బతుకులు  మోయు సుట్ట బట్ట  
శేలిమే నీటి సాళువ 
నాట్లేయు గాజుల గట్లు 
తట్టు తగిలిన కంట  నీటి మాట  
నా తెలుగు సురుటి సుక్క 

ఎర్ర గాజులు



జమిందారి పెత్తందార్ల 
అరాచకానికి 
ఉవ్వేతున్న ఎగిసిన 
విప్లవ కెరటాలు 
సమ్మక్క సారాలమ్మ 
ఆ పునాది గద్దెపై 
వెలిసిన గాజుల సవ్వడులే
ఉద్యమ నినాదాలు 
మగనిలో సగభాగమై
కాయ కష్టంలో పెద్ద భాగమై 
కంటి కునుకును కావలిజేసిన పంట 
కంట సూడకముందే
గద్దలా తన్నుకుపోయిన 
భూస్వామ్య రెడ్డీలపై
సివంగిల దుంకిన  
సాకలి ఐలమ్మ
పుట్టిన పోరుగడ్డపై
గాజులు కవాతుజేస్తున్నై 
అహం అమాయకత్వాన్ని 
ఎక్కిరించింది 
కొవ్వేక్కిన మదం 
అత్మాభిమానాన్ని వేలివేస్తున్నది 
బుగ్గ తిన్న బలుపు 
ఎండిన డొక్కలపై
మెడ కట్టుకున్నది 
వంద సంవత్సరాల 
బానిసత్వానికి నిరసనగా 
ఎత్తిన పిడికిలి బిగిసి 
నరాలు చిందించిన రక్తానికి 
గాజులు ఎర్రబడినయి 
లాలి పాటలు ఊయలూపే గాజులు
నల్లగొంగడేసి విప్లవ గీతమై 
వేదికపై గళ్ళుమంటున్నవి 
కలం గాజులు 
ఉద్యమ మృదంగానికి 
సరిగమలు చెక్కుతున్నవి 
రాట్నం వడికిన గాజులు 
ఉరితాళ్ళను పెనుతున్నై
బతుకమ్మ ఆడిన గాజులు 
బతుకు పోరుకై సమ్మెజేస్తున్నయి
కాసుకోండి 
ఎర్రగాజు 
ఉద్యమ సూరీడై ఉదయించింది. 

రాజిన కొలిమి


నమ్మక పు ఊపిరిని
ఉరికోయ్యకేలాడదీస్తే
నినాదమై మ్రోగింది 
తేనెపూసి పక్కల పొడిస్తే 
గేయమైనది 
ఇంక కవితెక్కడది
 కాకరకాయేక్కడిది
మిగిలింది గుండె కోతనే 
 పాటెక్కడిది
ఆటెక్కడిది
కేవలం కంటి ఎర్రజీరనే
కంటిపాపపై రాసుకున్న 
ఎన్నికలల భవిష్యత్తు  
రాజకీయ జూదగాడి చేతిలో 
పావైపోయే 
ఇగ ఓటేక్కడిది
తూటా ఎక్కడిది 
 సీరఫ్ గుండెసెగలే 
నొప్పి ఒకని పెయిల 
మందోకని చేయిల 
ఉన్నోనికి నవ్వులాటాయే
లేనోనికి కంటిదారాయే 
ఊసర వెల్లుల 
మాటమార్పిడి మాయలాటలలో 
ఎవడు మనోడు
ఎవడు మందోడు  
ఏవి రాజీనామాలు
ఏవి పంగనామాలు 
 పలుకోట్ల గాయాల గానం  
శిరమెత్తి శివమెత్తి గళమెత్తి 
డప్పు సప్పు డోలే ఉరుకుతుంటే   
 ఇగ ఆశ నివురు కప్పిన నిప్పైనా
నిరాశ రాజిన కొలిమిమంటైన 
ఒకటే ఆరాటం 
 ఒకటే పోరు  మార్గం  
 ఒకటే నినాదం 
జై తెలంగాణ

పావుల సంచి


ఒక చేత్తో సంచిని 
నెలకు రాస్తూ 
మరొక చేత్తో బిడ్డని 
పై కేగదోస్తూ 
మధ్య మధ్యలో 
తువ్వాల కొంగును సవరిస్తూ 
హడావిడి చేస్తోంది ఆరింద 
ఇంటిల్లి పాదికి 
అది అమ్మై
ఆడుకుంటుంది ....ఆడిస్తోంది 
ఆ ఆటలో 
ఎన్ని పాత్రల్లో 
అన్ని నైపుణ్యాలు 
ఆ సంచి పరిస్తే 
ప్రపంచం మొత్తం కనిపిస్తుంది 
ప్రతి వస్తువు అమూల్యమైనది 
సంచిని చూస్తే చాలు 
చక్రాల్లాంటి కళ్ళతో 
ఎన్ని మెరుపు కళలు 
జీవన నైపుణ్యాలు నేర్పిన 
ఆ పావుల సంచిని వదిలి 
బడి సంచి బారాన్ని 
బారంగా మోస్తూ  
సమస్త బాల్యాన్ని త్యాగం చేసి 
దిగాలుగా 
బడిలో కాలు మోపిన 
ఆ అమ్మలగన్న యమ్మను 
ఎలా స్వాగతించను 
ఏమి భోదించను  
 నేను చదివిన 
తత్వ, మనస్తత్వ శాస్త్ర్రాలన్ని 
చిన్నారి సంపూర్ణ మూర్తిమత్వ వికాసాన్ని 
చదవడానికే సరిపోతున్నాయి 
నా ఒడి బడిలో 
విజ్ఞ్యానాన్ని దానికి పంచుతూ 
 భౌతిక తత్వానికి 
అతీతమైన విద్యను
దాని నుండి నేను నేర్చుకుంటూ 
ఒకరికొకరం 
గురువులం 

చెమట చిత్తడి


కాలం మారిందని ఎవరన్నారు 
తడవడంలో మార్పేమీ లేదు 
అప్పుడు వాన తో 
ఇప్పుడు చెమట తో 
చిట పట చినుకుల తో
పుడమి ముంగిట 
చిత్తడి  చిత్తడిగా 
ముగ్గులల్లాల్సిన వానమ్మ 
మూతి ముడిచింది 
మట్టి వాసన గుబాళింపుతో 
మురవాల్సిన మనసులు 
హా , హా కారాలతో 
చిరాకు పడుతున్నాయి
మేఘాల జలధారను 
ఆర్తితో గుండెకు హత్తుకొని 
విత్తంత ఆశను 
చిగురిపచేసే
భూతల్లి ఆశను అడియాశలై 
గుండెలు పగిలి పోతున్నాయి
రైతన్న ముఖంలో
భవిష్యత్తుపై ప్రశ్నగుర్తు 
విలయ తాండవంచేస్తుంది 
   







లేలేత  కిరణాల  సొగసుతో  భావ  కవిత్వాన్ని  చవిచూపి 
 చురుకైన  చురకలతో  విప్లవభావాని  అందించి 
 వాలు  కిరణాలతో  అభుదయాన్ని  నేర్పి 
 అలసిన  కిరణాలతో  అద్యత్మికతను  అందించి 
 రవి  కవి  గా  మిగిలాడు 

ఋతువుల చిత్రం


సూరీడు ఆకాశాన్ని ముద్దాడకముందే 
వర్షం ఆర్ద్రతయై  భూమిని  తాకింది 
సూరీడు ఆకాశ బొడ్డున వడ్డాణమై మెరుస్తుంటే 
ఎండా చుర్రున భూమిని ఆవరించింది 
ఆకాశ గంగలో సూర్యుని మునక చూసి 
చలి ఆర్తిగా భూమిని హత్తుకుంది
ఇదేమి వింతో 
ఒక్క రోజులో, ఎన్ని ఋతువులో?   
     

కవిత్వ ఒరవడి


ప్రపంచం ఒక పద్మవ్యూహం అయితే  
కవిత్వమే అస్త్రం 
ఓటమి గెలుపుల జీవితానికి 
కవిత్వమే పాంచజన్యం .
గుండెకార్చే కన్నీటికి
కవిత్వమే ఓదార్పు హస్తం 
కలాన్నిసందించు .
కాలాన్నిఎదిరించు.   

బాల్యం


పలక పై గీసుకున్న 
పిచ్చిగీత కాకూడదు
అందమైన అక్షరమై 
శాశ్వతముగా నిలవాలి 


పాలబుగ్గల పసి ప్రాయం 
చిరునవ్వులు చిందించాలి 
లేలేత చేతులు 
కళలను ఆడించాలి 


బాల్యం భవిష్యానికి
తీపి గుర్తు  కావాలి 
అలకలు అల్లరులూ 
జ్ఞ్యాపికగా మిగలాలి

బాల్యంలోనే మంచిని 
మొగ్గలోనే  చిదిమేస్తే 
భావితరాలకింక 
అరాచకమే మిగులుతుంది.   

మరో మహాత్మ



చాన్నాళ్ళకి ఓ వార్త
అసంభవం అనుకున్న
అవినీతిని మై పూత ను
కరిగించే శంఖారావమైంది
నీరసించిన ప్రజాస్వామ్యం లో
చైతన్య ప్రభంజనం  తెచ్చింది
దొరతనం దొంగతనానికి అలవాటై
డొక్కల్ని పిండుకుంటున్న రాక్షసత్వం
ఒకడు కొండచిలువల్ని మింగితే
మరొకడు వానపాములైన మేలే
అన్నతీరుపై యువకెరటం ఎగిసింది
చట్టాలే మన ఆయుదాలని
వేల చేతుల్ని ఒక్కటి చేసి
సత్యాగ్రహి కొరడా ఝులిపించిన
ఓ ఋషీ, మరోమహాత్మా
అన్నా హజారే మీకు జేజేలు   

చెమట చినుకు

సెల్లో కోకిల పాట 
బోన్సాయి  మామిడి పూత 
కాటరింగ్  పిండి వంటల కమ్మదనం 
రాతిరి సీసాలో చేదు అమృతం
చలువ కళ్ళ లోగిళ్ళలో 
నిత్య ఉగాది 
హోటల్ బోజనంలో 
అమ్మ చేతి గుర్తులను వెతుక్కుంటూ 
ఫ్రిజ్ లో కూల్డ్రింక్ కేం తెలుసు 
కొత్త కుండలో ఉగాది పచ్చడి రుచి
ప్లాస్టిక్ మనుషులకేం తెలుసు
అర్ర లో కాగుల వాసన 
పెద్దిల్లకు తెలిసిందల్లా 
నోటే నోటి కాడి ముద్ద
గుడిసనే తన బ్రతుకుకు పునాదని 
మరచిన భవనం విర్రవీగినట్టు 

మట్టిబెడ్డను  వెన్నేముద్దగా మార్చే
కాళ్ళు పల్లేరు లైతేనే
ప్రకృతి పల్లవాల పూత అడ్డుకునేది 
చెమట చినుకులో తడిస్తేనే
మట్టి పాలకంకై విచ్చుకునీది 
అలసిన మరిపించిన కూనిరాగమే 
జానపద జావళియై
కూకిలమ్మకు పాట నేర్పింది
నాకు కవిత్వ మిచ్చింది 
ఏ భేషజాలు లేని నా పల్లె తల్లి 
మట్టి కుండై, వెదురు గంపై
నాగలి కర్రై , పాడి ఆవు దూడై
కష్టాల చేదును మింగుతూ 
సుఖాల తీపిని జగతికి పంచేది 
ప్రపంచం పారిశ్రామికీకరణ 
పండగ దండిగా చెసుకుంటుంటే
పల్లె గడిచిన ఉగాదులను
తలపోసుకుంటున్నది 
నింగిలో చిక్కుకుపోయిన చూపుల్ని 
నేలమ్మకు  పొదుగు దారి
పచ్చని పట్టుచీరను 
ప్రకృతికి సారే గా ఇద్దాం 
పల్లెమ్మ ఇంట 
నిత్య వసంత ఉగాదిని తెద్దాం  
                                            


బాల్యం

బాల్యం జాతర లో కొన్న 
రంగుటద్దాలు పెట్టుకున్నది 
రంగు రంగుల లోకం
సీతా కోకచిలుకై  పరుగెత్తుతుంటే 
దానెంట పాదాలు
పదనిసలు పాడాయి
కాలం కరిగిపోయింది
రంగద్దాలు వెలసిపోయాయి
రంగుల్ని అందుకోలేక 
పాదాలు పల్లెరులయ్యాయి 
కాముని జాజర వర్ణాలన్ని
విలీనమై ఓ విశాల 
శ్వేత వర్ణానికి జన్మనిచ్చాయి
అ విశాల విశ్రాంత చాయలో 
బాల్యం జాతర గుర్తొచ్చి 
మనసు తుమ్మెదై
సప్తవర్ణ గానాన్ని  
వినిపిస్తూనేఉండేది

వ్యంగ్యోక్తి

రాజకీయ తేనెటీగలు 
చిటారు కొమ్మ స్విస్స్ లో
తేనెను దాచాయి
చాచిన బ్రతుకులపై 
తియ్యగా కుట్టుతున్నాయి
ఈ  తేనె భాధకు నవ్వుతు ఏడుద్దాం

గుడిసె గుండె కోత

తెల్ల వారని రేయికి  
ఎన్ని చందమామలు అద్దితేనేమి   
            నిరంతర భాష్పలకి 
          ఎన్ని భాష్యాలు కూర్చితేనేమి 
నిట్టూర్పుల సేగలకి 
ఏ సునామి రాదేం
          ఎన్ని రాత్రులను దారవోయను
           ఒక్క వేకువకై 
పోగొట్టుకోవడం ఎంత సులభం 
కుడి చేయి వెతుక్కుంటుంటే 
ఎడమ చేయి అడ్డుతగలడం
అవ్వ......! ఎంత విడ్డూరం.
           స్వేచ్చా వాయువులకై
           గాలిలో వెదుకుతున్నాయి 
           వేలాది ప్రశ్న ముఖాలు.
చితికిన బ్రతుకు వీణ తీగలు
సవరించుకుందామంటే
ఆ తీగలే ఉరి తాల్లవుతున్న వైనం
          చలువ రాతి మేడకేంతెలుసు
          గుడిసె గుండె కోత
          ఏ గానం పాడిన 
         స్వార్థపు జీర అడ్డుతగులుతూనే ఉంది
ఇక దీక్ష శిబిరాలకై
పక్కా ఇల్లు నిర్మించాల్సిందే
 ఇన్నేళ్ళ కసి అంతా
గాండ్రించే గొంతుకై
ఎత్తిన పిడికిలి ఎరుపై
స్వజాతి బానిసత్వానికి
చరమ గీతం పాడాల్సిందే 
             మనసు ప్రశ్నకి 
              మనిషే జవాబు.

కవిత

కవి హృదయం లో
కవిత ఎప్పుడు 
పుడుతుందో 
ఎవరికీ తెలుసు

        జ్ఝుమ్మని   బ్రమర గీతంలా
        ఎదలో సొదలు రేగిన వేళ 

ప్రేమ పరవశం పొంగి 
రసరమ్య రాగాలు 
పలికిన వేళ 

        కలత చెందిన మనసు 
        కన్నీరైన వేళ 

ఆగని ఆవేశం
కన్నెర్ర చేసిన వేళ

         హృదయం నిండా పొంగిన 
         భావ మంజరిని 
         కవి 
         రసజ్ఞుల ఎద పలకలపై 
         కవిత్వం గా ముద్రిస్తాడు 

చరిత్ర పుటలపై 
చెరగని ముద్రవుతాడు
కవి రవిగా మిగిలిపోతాడు  



naren

జై యోగేశ్వర్

రుచిరోక్తి

మంచి మాట   చుట్టూ సముద్రపు నీరు ఉన్నా
దీవి నూతిలో మంచినీరు దొరికినట్టు 
గంధపు చెట్లు సుగందాలు వెదజల్లి నట్టు 
దుర్జనుల మధ్య ఉన్న సజ్జనుడు
తన మంచి తనాన్ని మరువడు
  -శారదహన్మాండ్లు

రుచిరోక్తి2



ఒక్కఅడుగుముందుకెయి 
పదిఅడుగులు నీతో పోటి పడతాయి
  కొన్ని అడుగులు నీతో కలిసి నడుస్తాయి
మరి కొన్ని నిన్ను అనుసరిస్తాయి
 కదలనిఅడుగులకైఆలోచింఛి
      నీ అడుగులను ఆపకు
                                -శారదహన్మాండ్లు