మూడు అడుగులు



చిట్టి పొట్టి సవ్వడితో
బడిలో తొలకరి
కంటి ఆకాశం పై
కలల మెరుపులు
తరాల చీకటిని చిల్చుకొని
తొలి చినుకులు తొలి అడుగై
చదువు విత్తనం నాటాయి
కొత్త పుస్తకం
కొత్త అక్షరం
అక్షరాల అల్లుకొని
పదాలు నడకలు నేరుస్తుంటే
చిట్టి మోముపై చిద్విలాసం
ఎదిగీ ఎదగని లేత ఆలోచనలకు
నవ వసంతం   మలి అడుగై
ఆశల చిగుళ్లనల్లింది
కుతూహలం మొగ్గలు తొడిగింది
బట్టీ కంచెను దాటుకొని
పచ్చని ఫలాలకై అన్వేషణ
జ్ఞాన సుధా నిధి మూడో అడుగై
ముడుచుకున్న పాత ముద్రను
బద్దలు కొట్టింది
అక్కడ పోలికలేదు కొలతలు లేవు
తరతమ భేదం లేదు
ఉన్నదల్లా ప్రదర్శన ,ప్రశంస
చిన్ని మనసుకిపుడు
అందరికన్నా ముందే సూర్యోదయం .

చినుకులు వాలిన మట్టి వనం






తాను లేక మొలక లేక
మెతుకు లేక బ్రతుకు లేక
ఒళ్ళంతా కళ్ళతో
తనకై చూస్తారని

అనుకోని అతిథిలా
లోగిలిలో నిలవాలని
తన కౌగిలి  జనావళికి
సిరి వాకిలి కావాలని

మట్టి వనం అవ్వాలని
తల్లి ఋణం తీర్చాలని
వీధి వీధి కలయ తిరిగి
ముంగిలి ముద్దాడాలని

ముదిత కన్న ముందు తానె
చుక్కల ముగ్గవ్వాలని
ఉప్పొంగిన ఆనందం
ఉప్పెనలా మారగా

చేలగట్ల పైన పొరలి
పచ్చ పచ్చగ నవ్వాలని
తొలి తాకిడి గుబాళింపు
ఎద ఎదకు అద్దాలని


ఉబికిన ఉభలటంతో
  నేలకు దిగభోయింది
లేలేత తొలి చినుకు
దిగంతాలకో మెరుపు

వాలిన మరు క్షణం
వేయి ముక్కలుగ చీల్చే
రాతి గుండె రోడ్ల వంక
సిమెంటు వాకిళ్ళ వంక

విస్తు బోయి చూసింది
విల విల విల లాడింది

కాలిన అడవుల  వంక
లోయలైన నదుల  వంక
వింతగ విక్షించింది 
కన్నీళ్ళతో  నిలదిస్తోంది

ఆప్తంగా లుప్తం చేసుకొనే
మాతృ మట్టి ఎక్కడని
గమనానికి అడుగులు నేర్పిన
ఇసుకతిన్నె లేవని

తిరిగి తిరిగి వేసారి
అడిగి అడిగి అలసి పోయి
తనకోసం తెరుచు కొని
ఇరుకు గదుల గుండె వీడి

రైతన్న దోసిలిలో
ముతేమై వాలింది .