Showing posts with label విలువలు తొడిగిన అక్షరం. Show all posts
Showing posts with label విలువలు తొడిగిన అక్షరం. Show all posts

విలువలు తొడిగిన అక్షరం



పొట్ట చీరితే మట్టి తప్ప 
ఏమి లేని మట్టి బతుకు 
కలలను పండిద్దామని
పానాదెంట పరుసుకున్న 
పల్లేరుల్ని ఏరుకుంటూ 
చెమట పోసి పెంచిన 
ఎండల్ల వాన 
పెయ్యి పరిసి కాసుకున్న 
డొక్కల్లో బాయి తోడి 
నోటికి ముద్ద అందించిన 
అక్షరం కాపు కొచ్చింది 
అక్కున జేర్చుకుంటే 
మట్టంటుతదని సూసి మురిసిన 
అక్షరానికి రెక్కలచ్చినయి 
అవ్వోసొంటి పల్లె నిడిసి
పట్నం సాఫ్ట్ వేర్  పై వాలింది 
అక్షరం ఎచ్చని రెక్కల కింద 
ఉడిగిన వయసు 
సుఖపడుతదనుకొన్న 
దానికి సెంటు వాసనలే తప్ప 
చెమట వాసన గిట్టుతలేదు
కన్న మట్టి తల్లి నిడిసి 
పోరుగోని ఊడిగం మీద 
మోజు పెంచుకున్నది  
విలువలు లేని అక్షరానికి 
పాతేద్దమనుకున్న 
మట్టి మనసు ఒప్పలే 
గందుకే 
విలువల్ని నాటిన 
ఇప్పుడు విలువలు తొడిగిన  
అక్షరం అంకురించింది