మతం మత్తుఎక్కువైతే ఉన్మాదమే
ప్రేమ పిచ్చి ఎక్కువైతే ఉన్మాదమే
అతి అన్ని విధాలా చేటే కదా మిత్రమా!
సంపద మీద ఆశ ఎక్కువైతే
ఉన్మాదమే.
అక్షరాలను దిద్దు
చదువు సాకారమవుతుంది
కలను ఇలపై దిద్దు
ఆశలు సాకారమవుతాయి
దిద్దుకోవడం తప్పేమీ కాదు మిత్రమా!
బాల్యాన్నీ వికసించనీ
యవ్వనాన్ని అరగదీయనీ
అణువణువు పండితేనే మాధుర్యం మిత్రమా!
వృద్ధాప్యాన్ని వెలుగించనీ.
కొత్తగా పుట్టాలని ఉంది
కొత్తగా రాయాలని ఉంది
సరికొత్తగా వికసించడం నైజం మిత్రమా!
పాతను పాఠంగా నేర్వాలని ఉంది.
మనిషి ఎప్పుడు మాయమవుతాడో తెలియదు మనసు ఎప్పుడు
మారిపోతుందో తెలియదు ఆశాశ్వతంపై శాశ్వతముద్రలు వేస్తుంటాము మిత్రమా!
ప్రకృతి ఎప్పుడు పరవశిస్తుందో తెలియదు.
పరిశోధనకు ప్రశ్న పునాది
ప్రశ్నకు ఆలోచన పునాది
విజ్ఞానం తోనే ప్రగతి మిత్రమా!
ఆలోచనలకు చదివే పునాది.
సైన్స్ డే శుభాకాంక్షలు.
కవిత్వం రాయందే ఉదయం వెచ్చబడదు
కవిత్వం రాయందే హృదయం చల్లబడదు
ఒక్క వాక్యానికై అన్వేషణ మిత్రమా!
కవిత్వం వికసించందే జీవితం
దిద్దబడదు.
కాటుక కరిగిన రాత్రులకు వెన్నెల నద్దనీ
కలతల నలిగిన మనసులకు మోహము నద్దనీ
మేలుకొలుపే కలం పని కదా మిత్రమా!
వేదన చిందిన వాక్యాలకు కవిత్వము నద్దనీ
No comments:
Post a Comment