నమస్కారం నా పేరు శారదహన్మాండ్లు, నేను ఉపాధ్యాయురాలిని, మాది ఇందూరు జిల్లా. సాహిత్య పరిమళాలను ఆస్వాదిస్తూ సామాజిక సమస్యలపై స్పందనలను కవిత రూపం లో అల్లడం నా ప్రవృత్తి. సమాజం మనందరికి నివాసాన్ని అందించిన కల్పతరువు మూలాలను కాపాడడం ఫలాలను పంచుకోవడం సమానత్వం ప్రదర్శించడం మన భాద్యత,అందుకే నా స్పందనలను మీ ముందు ఉంచుతున్నాను ప్రతిస్పందనలను తెలియ చేయండి. ధన్యవాదాలు.
పచ్చటి పచ్చడి
ఉగాది పచ్చడిలో
పచ్చటి రుచికై వెతుకుతున్నా
అది చూసి చెట్టు నవ్వింది
చేను నవ్వింది
భూమి నవ్వింది
పీకల దాకా ప్లాస్టిక్ నింపి
రసాయనాల విషం చిమ్మి
కృత్రిమ సృష్టిని ఆహ్వానిస్తుంటే
సహజ ఫల మధురిమలు
వెతకడం వెర్రితనమేనని
ఓ మొక్క అడిగింది
నిష్కల్మష మైన నిర్మలమైన
అమ్మ ఒడిలో నాటమని
భూమండలంలో
మనిషి లేని చోటే
ఆ పుణ్యక్షేత్రం
అక్కడ ఈ జన్మలో నాటి
మరు జన్మలో
పచ్చటి రుచిగల
పచ్చడినడుగుతా.
శారదాహన్మాండ్లు
బలపం
బలపం
బలపాన్ని తల్చుకుంటే
మనసూ నోరూ ఊరుతయ్
అరుగుతూ అక్షర ముత్యాలను
స్రవించే బల్పం
ఒక బాల్య జ్ఞాపిక
పార్త లేదని
నాల్క కద్దుకున్నప్పుడు
ఆ రుచి అమృతం కన్నా కమ్మనే
రాసీ రాసీ
ఒంటి నిండా బల్పం బస్వం
పూసుకున్న వటువు
బాల శివుడు కాదా ఏం
పిత్కంత అయ్యేదాక
గుండ్రని అక్షరాలు
గుండ్రంగా సక్లం ముక్లం పెట్టుకుని
దిద్దినం గన్కనే
ఇంత అందమైన స్థిమితమైన
జీవితం మనది
ఏ కమీషన్ మన బల్పం
ఎత్కపొయిందో?
శారదా హన్మాండ్లు
Subscribe to:
Posts (Atom)