చెమట పువ్వు



అదిగొ అదిగో 
శ్రమ చైతన్యం 
ఆదిగదిగో 
శ్రమ సౌందర్యం 
చెమట బిందువుల 
నేకం చేసి 
దోసిట పేర్చి 
ఆర్ఘ్యమునిచ్చి
అనేక కులాల 
కతీతమైన 
శ్రమకుల మౌన్నత్యమునెంచి  
పుడమినుదుటన
రక్తతిలకమై
పుడమి గుండెపై
చెమట  పువ్వువై 
ఎగుళ్ళ దిగుళ్ళ నైక్యంచేసి
సమ భావననే
పథముగా మార్చి 
మట్టిలో మట్టై
పచ్చగా నిలిచి 
ఏటిలో ఏరై 
చినుకుగ మారి
ఎండిన డొక్కను  
ఫనముగా పెట్టి 
నిండుగ మెండుగ 
మెతుకును పరిచి 
సర్వ మానవ కల్యాణానికి
ప్రగతి  బావుటా ఎగరవేయుటకు
రహదారులలో  
పునాదులల్లో
కండను, గుండెను 
సమాది చేసి
కలలను మరిచి 
అలవై ఎగసి
పరిశ్రమలలో 
యంత్రం నీవై 
తను, మనః శ్రమనే 
పావుగా మలచి 
విజయ గీతికి 
తంత్రివి నీవై 
కాల గతికి 
రథ చక్రానివి నీవై
 అశాంతి వీధుల
శాంత పథాకం
బీడుల  దారుల 
హరిత పతాకం
సమస్త కార్మిక 
కాషాయ పతాకం
ఏక ఛత్రమై 
ఎర్ర వర్ణమై 
పంచ బూతాల మనస్సాక్షిగా
కోట్ల కోట్ల జనాల సాక్షిగా 
రేపన్నది నీదే 
జోహారు కార్మికా..

సంధ్యా జ్యోతి





తొలి పొద్దులో భూపాల రాగం 
మాలి పొద్దులో కంబోజి రాగం 
అసుర సంధ్యవేళ 
వెన్నెల్లా కయాల్సిన పేగుభందం
అసురులై సత్తా, విత్తం పీల్చేస్తున్నారు 
కాలు మీద కాలు వేసుకోవాల్సిన వృద్ధాప్యం 
కన్న కడుపు చేత వెలివేయబడి 
అంపశయ్యపై అగచాట్లు పడుతున్నది 
ఉభయ సంధ్యల నడుమ 
కష్టాలతో కాయలు కాసిన కాయానికి  
పున్నామ నరకం పుత్రుడే 
యంత్ర యుగంలో దీపావళి హారతులు 
మనవళ్ళ ముద్దులు, చితికి నిప్పు అన్నీ ఆన్ లైన్ లోనే 
ఆవిరైన  సౌహాద్రం మళ్లీ చిగురించాలే 
ముడతల్ని నిమిరే చల్లని హస్తాలు 
ఇంటింటా మొలకెత్తాలి 
శ్రవణ, పుండరీక భావాలూ గుండె చప్పుడవ్వాలే   
అయినా పుట్టడం, బ్రతకడం నేర్పినవాడు 
గిట్టడం నేర్పడా! 
నునులేత నిగ్గుల పచ్చని పకృతి 
పండటం, రాలడం ఎంత సహజం 
చింతలేని జీవనానికి 
పశు పక్షాదులే ఆశ్వాసం 
అమ్మా, నాన్న! ఎందుకుభయం 
మరణం అమృతమయం 
అందుకు నేను కానా? ఊతం
మీ సాయం సమయాన 
సంధ్యా జ్యోతిని నేనే.  

అమవస జాబిలీ




పొగచూరిన ఆకారం 
అరిగిన పనిముట్ల పోగు 
పండంటి కలల్ని 
ఎడారిలో ఒయాసిస్సు కళ్ళతో 
వెతుకుతున్నది 
ఆ పుడమి గుండెలో 
ఎన్ని లావా నదులు 
ఎండిన చర్మం పై ఎన్ని చేతి ముద్రలు 
మరిన్ని పాదముద్రలు 
ఆశల పందిరి క్రింద 
అధికార లాంచనంగా 
సంపాదించిన 
మగని కుచ్చిత హక్కు ముద్రలవి 
తర తరాలుగా సంపాదించుకున్న 
బానిస ఆస్తి అది 
అరిషడ్వికారాలు 
తీర్చుకోవడానికి 
పెనిమిటికి కట్టబెట్టిన 
యంత్రమైంది 
అమవస నిషి చుట్టుకున్న 
నిండు జాబిలీ 
వీడని గ్రహణం పట్టి 
విలపిస్తున్నది 
ఎర్రబడ్డ కళ్ళు చూసి
ఎత్తిన ఆ చేయి చూసి 
పశువు సైతం సిగ్గుపడి 
మొగుడి పాత్ర వద్దన్నది 
నాగజెముడి కాపురం 
మెత్తని ఊబి సంసారం 
ఒంటెద్దు బారం 
కడదాకా మోయడం 
పగలు రాత్రి 
ఆకళ్ళు తీర్చుకొనే మొగుడు 
కొవ్వు పెరిగి 
పశువులా కొట్టడం 
మొగుడు పెళ్ళాల వ్యవహారమనే 
గుడ్డిగా వాదించే 
పక్షపాతి సమాజం 
హృదయరోదనలకి 
కరగని మృగంపై 
తిరుగు బాటేన్నడో
బిగుసుకున్న నరాలు 
పిడికిలయ్యే దెప్పుడో.