పొగచూరిన ఆకారం
అరిగిన పనిముట్ల పోగు
పండంటి కలల్ని
ఎడారిలో ఒయాసిస్సు కళ్ళతో
వెతుకుతున్నది
ఆ పుడమి గుండెలో
ఎన్ని లావా నదులు
ఎండిన చర్మం పై ఎన్ని చేతి ముద్రలు
మరిన్ని పాదముద్రలు
ఆశల పందిరి క్రింద
అధికార లాంచనంగా
సంపాదించిన
మగని కుచ్చిత హక్కు ముద్రలవి
తర తరాలుగా సంపాదించుకున్న
బానిస ఆస్తి అది
అరిషడ్వికారాలు
తీర్చుకోవడానికి
పెనిమిటికి కట్టబెట్టిన
యంత్రమైంది
అమవస నిషి చుట్టుకున్న
నిండు జాబిలీ
వీడని గ్రహణం పట్టి
విలపిస్తున్నది
ఎర్రబడ్డ కళ్ళు చూసి
ఎత్తిన ఆ చేయి చూసి
పశువు సైతం సిగ్గుపడి
మొగుడి పాత్ర వద్దన్నది
నాగజెముడి కాపురం
మెత్తని ఊబి సంసారం
ఒంటెద్దు బారం
కడదాకా మోయడం
పగలు రాత్రి
ఆకళ్ళు తీర్చుకొనే మొగుడు
కొవ్వు పెరిగి
పశువులా కొట్టడం
మొగుడు పెళ్ళాల వ్యవహారమనే
గుడ్డిగా వాదించే
పక్షపాతి సమాజం
హృదయరోదనలకి
కరగని మృగంపై
తిరుగు బాటేన్నడో
బిగుసుకున్న నరాలు
పిడికిలయ్యే దెప్పుడో.
No comments:
Post a Comment