ఒక్క బింబం నుండి
అనేక ప్రతి బింబాలుగా ఉదయిస్తూ
ప్రతి ప్రతిబింబానికి మనసును నిర్మిస్తూ
సహస్త్ర బాహువులతో
సాహస విన్యాసం చేయడం
అవసరాన్ని దాటి అలవాటె
ఇప్పుడు స్వభావం మారిపోయింది
తరాల క్రిందట దోచుకోబడ్డ
అహాన్ని పొరలు పొరలుగా పేర్చుకుంటూ
వంగిన వ్యక్తిత్వపు నడకకు
ఆసరాలను కూర్చుకుంటూ
నింగికి పయనం కావడం
అవసరాన్ని దాటి అలవాటై
ఇప్పడు హక్కుగా మారిపోయింది
నా,నీ భేదం లేకుండా చేసే గాయాలకు
చిగుళ్ళను తోడుగుతూ
కుసుమాలను అద్దుతూ స్వయం సంజీవనియై
రేపటి సామాజానికై అమృతత్వాన్నిమోస్తూ
నిత్య, చేతన వసంతం కావడం
అవసరాన్ని దాటి అలవాటై
ఇప్పుడు ఆనవాయితీగా మారిపోయింది
గ్రీష్మపు ఎదపై హేమంతాలు పొదగడం
కుటుంబాన్ని సమాజాన్ని
మునివేళ్ళ పట్టుకొని
ముగ్గులా అల్లడం నీకు తెలుసు
రెక్కలకు చుక్కలు అద్దుకొని ఎదగడం
నెల దిగిన హరివిల్లై
మొలకలకు వీళ్ళను కూర్చడం నీకు తెలుసు
గాజుల సవ్వడి
మానవత్వ విభేదానికి గుణపాటం వినిపించేలా
చెయ్యెత్తి జై కొట్టు
విజయోస్తు మహిళా.
No comments:
Post a Comment