అరాచకానికి
ఉవ్వేతున్న ఎగిసిన
విప్లవ కెరటాలు
సమ్మక్క సారాలమ్మ
ఆ పునాది గద్దెపై
వెలిసిన గాజుల సవ్వడులే
ఉద్యమ నినాదాలు
మగనిలో సగభాగమై
కాయ కష్టంలో పెద్ద భాగమై
కంటి కునుకును కావలిజేసిన పంట
కంట సూడకముందే
గద్దలా తన్నుకుపోయిన
భూస్వామ్య రెడ్డీలపై
సివంగిల దుంకిన
సాకలి ఐలమ్మ
పుట్టిన పోరుగడ్డపై
గాజులు కవాతుజేస్తున్నై
అహం అమాయకత్వాన్ని
ఎక్కిరించింది
కొవ్వేక్కిన మదం
అత్మాభిమానాన్ని వేలివేస్తున్నది
బుగ్గ తిన్న బలుపు
ఎండిన డొక్కలపై
మెడ కట్టుకున్నది
వంద సంవత్సరాల
బానిసత్వానికి నిరసనగా
ఎత్తిన పిడికిలి బిగిసి
నరాలు చిందించిన రక్తానికి
గాజులు ఎర్రబడినయి
లాలి పాటలు ఊయలూపే గాజులు
నల్లగొంగడేసి విప్లవ గీతమై
వేదికపై గళ్ళుమంటున్నవి
కలం గాజులు
ఉద్యమ మృదంగానికి
సరిగమలు చెక్కుతున్నవి
రాట్నం వడికిన గాజులు
ఉరితాళ్ళను పెనుతున్నై
బతుకమ్మ ఆడిన గాజులు
బతుకు పోరుకై సమ్మెజేస్తున్నయి
కాసుకోండి
ఎర్రగాజు
ఉద్యమ సూరీడై ఉదయించింది.
No comments:
Post a Comment