ఒక కన్ను వర్షపు జల్లుల్లో హరితాన్ని తడిమి సింగిడై పూస్తది ఒక కన్ను మోడైన పుడమికి పచ్చని ఆచ్చాదనాన్ని మెచ్చి ఇచ్చగా ఇస్తది ఆరు ఋతువులను కాటుకగా మూడు కాలాలను కన్నులుగా ప్రసరిస్తున్న సూర్యుని మూడో కన్ను ఎండాకాలం ఈ కన్ను తెరవకుంటే మిగితా కన్నుల పండుగ ఉండదుగా నేటి శిట శిట లే రేపటి చిటపట చినుకులు బువ్వ మొలకలు సిరుల పిలుపులు. శారదాహన్మాండ్లు

పచ్చటి పచ్చడి

ఉగాది పచ్చడిలో పచ్చటి రుచికై వెతుకుతున్నా అది చూసి చెట్టు నవ్వింది చేను నవ్వింది భూమి నవ్వింది పీకల దాకా ప్లాస్టిక్ నింపి రసాయనాల విషం చిమ్మి కృత్రిమ సృష్టిని ఆహ్వానిస్తుంటే సహజ ఫల మధురిమలు వెతకడం వెర్రితనమేనని ఓ మొక్క అడిగింది నిష్కల్మష మైన నిర్మలమైన అమ్మ ఒడిలో నాటమని భూమండలంలో మనిషి లేని చోటే ఆ పుణ్యక్షేత్రం అక్కడ ఈ జన్మలో నాటి మరు జన్మలో పచ్చటి రుచిగల పచ్చడినడుగుతా. శారదాహన్మాండ్లు

బలపం

బలపం బలపాన్ని తల్చుకుంటే మనసూ నోరూ ఊరుతయ్ అరుగుతూ అక్షర ముత్యాలను స్రవించే బల్పం ఒక బాల్య జ్ఞాపిక పార్త లేదని నాల్క కద్దుకున్నప్పుడు ఆ రుచి అమృతం కన్నా కమ్మనే రాసీ రాసీ ఒంటి నిండా బల్పం బస్వం పూసుకున్న వటువు బాల శివుడు కాదా ఏం పిత్కంత అయ్యేదాక గుండ్రని అక్షరాలు గుండ్రంగా సక్లం ముక్లం పెట్టుకుని దిద్దినం గన్కనే ఇంత అందమైన స్థిమితమైన జీవితం మనది ఏ కమీషన్ మన బల్పం ఎత్కపొయిందో? శారదా హన్మాండ్లు

అమ్మా నీపుట్టిన రోజు

అమ్మా నీ పుట్టిన రోజు పలకపై అక్షరమై సక్షాత్కరించి జ్ఞానమై నిలువెల్ల ఆవహించి నన్ను నడిపిస్తున్న తల్లీ !నువ్వెప్పుడు పుట్టినవ్ నా తల్లివి కదా!అయితే నేను పుట్టినపుడు నువు పుట్టినవ్ జగన్మాత వు కదా! సృష్టిని కన్న రోజు నువు పుట్టినవ్ అందుకే ఈ రోజు నువ్వు, నేను, నాకోసం ఈసృష్టి పుట్టినరోజు . మనకు శుభాకాంక్షలు ఓంకారము నీవు .పలికే శబ్దం నేను అక్షరం నీవు .ఆకారం నేను వెలుగు నీవు చూపు నేను పంచ భూతాలు నీవు. స్పర్శ నేను ప్రకృతి నీవు. ప్రవృత్తి నేను అనుభవం నీవు. అనుభూతి నేను ఇట్లా ఇద్దరం నీలో నేను నాలో నువ్వు పూర్ణమవుదాం. వసంత పంచమి శుభాకాంక్షలు. శారదాహన్మాండ్లు.

పాత క్యాలెండర్

పాత క్యాలండర్ గోడకు అనుభవాల బరువుతో వంగిన తాతవోలె ఇచ్చి పుచ్చుకున్న లెక్కల గీతలు శభాశుభాలచుట్టూ గుర్తులు అమ్మకు మాత్రమే అర్ధమయ్యే రాతలు పాత క్యాలెండర్ ఓ ఏడాదిని మోస్తూ అవగత మవుతూ కొత్తకు సగౌరవ స్తానం ఇచ్చింది ఎంత హుందాతనం చిన్నప్పుడు పాత క్యాలెండర్ ఒక కొత్త లెక్కలకాపి వెనుకున్న తెల్ల పేజీలకై అన్న చెల్లె నేనూ కొట్లాట ఇప్పుడాపని తప్పింది ఏ బరువులూ లేని కొత్తది ఎగిరెగిరి పడుతున్నది నూత్న లక్ష్యాల గుర్తులు సంబురంగా గీసుకోండి. శుభాకాంక్షలతో శారదాహన్మాండ్లు.