చెమట చినుకు

సెల్లో కోకిల పాట 
బోన్సాయి  మామిడి పూత 
కాటరింగ్  పిండి వంటల కమ్మదనం 
రాతిరి సీసాలో చేదు అమృతం
చలువ కళ్ళ లోగిళ్ళలో 
నిత్య ఉగాది 
హోటల్ బోజనంలో 
అమ్మ చేతి గుర్తులను వెతుక్కుంటూ 
ఫ్రిజ్ లో కూల్డ్రింక్ కేం తెలుసు 
కొత్త కుండలో ఉగాది పచ్చడి రుచి
ప్లాస్టిక్ మనుషులకేం తెలుసు
అర్ర లో కాగుల వాసన 
పెద్దిల్లకు తెలిసిందల్లా 
నోటే నోటి కాడి ముద్ద
గుడిసనే తన బ్రతుకుకు పునాదని 
మరచిన భవనం విర్రవీగినట్టు 

మట్టిబెడ్డను  వెన్నేముద్దగా మార్చే
కాళ్ళు పల్లేరు లైతేనే
ప్రకృతి పల్లవాల పూత అడ్డుకునేది 
చెమట చినుకులో తడిస్తేనే
మట్టి పాలకంకై విచ్చుకునీది 
అలసిన మరిపించిన కూనిరాగమే 
జానపద జావళియై
కూకిలమ్మకు పాట నేర్పింది
నాకు కవిత్వ మిచ్చింది 
ఏ భేషజాలు లేని నా పల్లె తల్లి 
మట్టి కుండై, వెదురు గంపై
నాగలి కర్రై , పాడి ఆవు దూడై
కష్టాల చేదును మింగుతూ 
సుఖాల తీపిని జగతికి పంచేది 
ప్రపంచం పారిశ్రామికీకరణ 
పండగ దండిగా చెసుకుంటుంటే
పల్లె గడిచిన ఉగాదులను
తలపోసుకుంటున్నది 
నింగిలో చిక్కుకుపోయిన చూపుల్ని 
నేలమ్మకు  పొదుగు దారి
పచ్చని పట్టుచీరను 
ప్రకృతికి సారే గా ఇద్దాం 
పల్లెమ్మ ఇంట 
నిత్య వసంత ఉగాదిని తెద్దాం  
                                            


No comments:

Post a Comment