గ్రీష్మపు హేమంతం




ఒక్క బింబం నుండి 
అనేక ప్రతి బింబాలుగా ఉదయిస్తూ 
ప్రతి ప్రతిబింబానికి మనసును నిర్మిస్తూ 
సహస్త్ర బాహువులతో 
సాహస విన్యాసం చేయడం
అవసరాన్ని దాటి అలవాటె
ఇప్పుడు స్వభావం మారిపోయింది 
తరాల క్రిందట దోచుకోబడ్డ 
అహాన్ని పొరలు పొరలుగా పేర్చుకుంటూ  
వంగిన వ్యక్తిత్వపు నడకకు 
ఆసరాలను కూర్చుకుంటూ 
నింగికి పయనం కావడం 
అవసరాన్ని దాటి అలవాటై 
ఇప్పడు హక్కుగా మారిపోయింది 
నా,నీ భేదం లేకుండా చేసే గాయాలకు 
చిగుళ్ళను తోడుగుతూ 
కుసుమాలను అద్దుతూ స్వయం సంజీవనియై 
రేపటి  సామాజానికై అమృతత్వాన్నిమోస్తూ 
నిత్య, చేతన వసంతం కావడం 
అవసరాన్ని దాటి అలవాటై 
ఇప్పుడు ఆనవాయితీగా మారిపోయింది 
గ్రీష్మపు ఎదపై హేమంతాలు పొదగడం 
కుటుంబాన్ని సమాజాన్ని 
మునివేళ్ళ పట్టుకొని 
ముగ్గులా అల్లడం నీకు తెలుసు 
రెక్కలకు చుక్కలు అద్దుకొని ఎదగడం 
నెల దిగిన హరివిల్లై 
మొలకలకు వీళ్ళను కూర్చడం నీకు తెలుసు 
గాజుల సవ్వడి 
మానవత్వ విభేదానికి గుణపాటం వినిపించేలా 
చెయ్యెత్తి జై కొట్టు 
విజయోస్తు మహిళా. 

విలువలు తొడిగిన అక్షరం



పొట్ట చీరితే మట్టి తప్ప 
ఏమి లేని మట్టి బతుకు 
కలలను పండిద్దామని
పానాదెంట పరుసుకున్న 
పల్లేరుల్ని ఏరుకుంటూ 
చెమట పోసి పెంచిన 
ఎండల్ల వాన 
పెయ్యి పరిసి కాసుకున్న 
డొక్కల్లో బాయి తోడి 
నోటికి ముద్ద అందించిన 
అక్షరం కాపు కొచ్చింది 
అక్కున జేర్చుకుంటే 
మట్టంటుతదని సూసి మురిసిన 
అక్షరానికి రెక్కలచ్చినయి 
అవ్వోసొంటి పల్లె నిడిసి
పట్నం సాఫ్ట్ వేర్  పై వాలింది 
అక్షరం ఎచ్చని రెక్కల కింద 
ఉడిగిన వయసు 
సుఖపడుతదనుకొన్న 
దానికి సెంటు వాసనలే తప్ప 
చెమట వాసన గిట్టుతలేదు
కన్న మట్టి తల్లి నిడిసి 
పోరుగోని ఊడిగం మీద 
మోజు పెంచుకున్నది  
విలువలు లేని అక్షరానికి 
పాతేద్దమనుకున్న 
మట్టి మనసు ఒప్పలే 
గందుకే 
విలువల్ని నాటిన 
ఇప్పుడు విలువలు తొడిగిన  
అక్షరం అంకురించింది 

శాంతి శాంతి శాంతిః

నా సహచారి తప్పిపోయింది  
మీ రెవరైనా చూశారా
దాని సుశ్రావ్యమైన పలుకులు 
మీరెవరిన విన్నారా 
ఒకప్పుడది పచ్చని పంట పోలమై 
రైతును ఆప్యాయంగా స్పృశించేది 
ధర్మపరుల బుజాలేక్కి 
హృదయాన్ని తడిమేది
న్యాయచరుల పాదాలకు
పోలబాట పరిచేది 
సత్యానికి నాలుక తానై 
అహింసా రాగం తానై 
నిత్య ప్రసన్న ముఖార విందమై నర్తించేది 
పాపబోసి నవ్వై 
పడతి గాజుల సవ్వడై
 మనసు మందిరం లో దివ్వెలా వెలిగేది 
కంటి కొలనులో ముత్తేమై మెరిసేది 
నట్టింట కవ్వమై 
పల్లె నడిబొడ్డు యాప చెట్టు అరుగై 
ఇక్యరాగం అల్లపించేది 
మువన్నెల జెండా శ్వేత వర్ణమై 
సమైక్య రాగానికి పల్లవై
శాంతిని వెదజల్లేది
ఇప్పుడది కనిపించడం లేదు 
బీడు భూముల్ని చూసి తల్లడిల్లిందో 
నట్టింటి కలహాలకి కలత చెందిందో 
నడిరోడ్డు లో ఓడిన రక్తానికి కన్నీరైందో 
మెదళ్ళలో పాకురు పట్టిన 
రాజకీయానికి భీతిచెందిందో 
ఫైళ్ళ లో పేరుకు పోయిన
కుంభ కోణాల గల్లనికి చిక్కిందో 
ఎక్కడుందో నా సహచరి 
మీరెవరైనా చూశారా
మీకు కనిపిస్తే ప్రేమగా నిమిరి 
మానవత్వపు గింజలు తినిపించండి 
బద్రంగా నా ఇంటి నాకిట 
అప్పజెప్పండి 
నా శాంతి కపోతాన్ని నేను 
నా తరువాత తరాలకు  
అందిస్తాను  .......... 

సురుటి సుక్క

సనుబాల అరువు 
నా ఇంటి తీనేల అరుగు 
సెలక శీను  దున్ను తల పాగా 
పాలే బతుకులు  మోయు సుట్ట బట్ట  
శేలిమే నీటి సాళువ 
నాట్లేయు గాజుల గట్లు 
తట్టు తగిలిన కంట  నీటి మాట  
నా తెలుగు సురుటి సుక్క 

ఎర్ర గాజులు



జమిందారి పెత్తందార్ల 
అరాచకానికి 
ఉవ్వేతున్న ఎగిసిన 
విప్లవ కెరటాలు 
సమ్మక్క సారాలమ్మ 
ఆ పునాది గద్దెపై 
వెలిసిన గాజుల సవ్వడులే
ఉద్యమ నినాదాలు 
మగనిలో సగభాగమై
కాయ కష్టంలో పెద్ద భాగమై 
కంటి కునుకును కావలిజేసిన పంట 
కంట సూడకముందే
గద్దలా తన్నుకుపోయిన 
భూస్వామ్య రెడ్డీలపై
సివంగిల దుంకిన  
సాకలి ఐలమ్మ
పుట్టిన పోరుగడ్డపై
గాజులు కవాతుజేస్తున్నై 
అహం అమాయకత్వాన్ని 
ఎక్కిరించింది 
కొవ్వేక్కిన మదం 
అత్మాభిమానాన్ని వేలివేస్తున్నది 
బుగ్గ తిన్న బలుపు 
ఎండిన డొక్కలపై
మెడ కట్టుకున్నది 
వంద సంవత్సరాల 
బానిసత్వానికి నిరసనగా 
ఎత్తిన పిడికిలి బిగిసి 
నరాలు చిందించిన రక్తానికి 
గాజులు ఎర్రబడినయి 
లాలి పాటలు ఊయలూపే గాజులు
నల్లగొంగడేసి విప్లవ గీతమై 
వేదికపై గళ్ళుమంటున్నవి 
కలం గాజులు 
ఉద్యమ మృదంగానికి 
సరిగమలు చెక్కుతున్నవి 
రాట్నం వడికిన గాజులు 
ఉరితాళ్ళను పెనుతున్నై
బతుకమ్మ ఆడిన గాజులు 
బతుకు పోరుకై సమ్మెజేస్తున్నయి
కాసుకోండి 
ఎర్రగాజు 
ఉద్యమ సూరీడై ఉదయించింది.