మట్టి తమకం





మన బంధం ఎన్ని వేల సంవత్సరాలది
నీకై ఎదురుచూడని క్షణం లేదు
మన కలయిక కొద్ది  కాలమైనా
అది సమస్త మానవాళికి ముదావహం
తమకంతో మనసు తప్తమైపోయింది
నీ పిలుపు కఠినమైనా
నా రాతి హృదయం
కరిగి నీరౌతది
నీ చూపు విద్యుల్లత
నా మేని సోకి హరివిల్లౌతది
నీ అతి ప్రేమ వృష్టి నా కొద్దు
అది నన్ను నిలువునా
కుదిపేస్తది
మూన్నాళ్ళ నీ ప్రేమ నన్ను
మూడు కాలాలు పచ్చగా ఉంచితే చాలు
మన కలయిక కై
ఎన్ని ఆత్మలు తోరనాలయ్యయో ?
ఎన్ని ఆత్మలు నిరీక్షనలయ్యయో ?
నుదిటి పై నీ వెచ్చని స్పర్శ
పూలవనం కావాలా
బుగ్గపై నీ చల్లని చిటిక
పాలకంకి అవ్వాల
నీ  స్పర్శచే నిలువెల్లా కరిగి న తనువు
పచ్చని పందిరవ్వాల
నీ గిలిగింత సుమ సౌరభాలను మించు
గుభాళింపు నివ్వాల
చిత్తడి చిత్తడైన నీ ప్రేమ
పురివిప్పి నాట్యమాడాల
నిత్య నూతనమైన
మన కలయిక
ప్రాణి కోటికి ప్రాణమయ్యేలా

రా ప్రియతమా
" నా వాన ముత్యమా ".

మట్టి పాట


గుండె భిగిసి 
ఉద్యమం పెల్లుభికితే 
నే నెట్లా భావకవిని అవుతా 
సుఖ పడ్డ నీ పాటను నే నెట్లా పాడుతా  

నా నీరు, నా మట్టి, నా సంస్కృతిని
పేయి నిండా తీనెలు తీసుకోని 
స్వాతంత్ర్య ఉషస్సు కోసం 
స్వాగత గీతం పాడాను 

పాటకు యాస అంటిందని 
మట్టి పాటకు గాయం చేశావ్ 
నీ లల్ల పాటను నా గొంతునుండి ఆశించడం.....అవ్వ !
నా పల్లవికి నేనే చరణం అవుతా 

కాలం రెక్కలపై 
అద్దిన పాదముద్రలు 
అనుభవాల పానాది పరుస్తుంటే 
ఎదలో కొత్త చిగుర్లు ఉదయించినయి 

త్యాగాల యశస్సు నరాల నిండా ఒంపుకొని 
నేను పాడే కొత్త పాటకు 
చీకటి కరిగిపోవాలే 
సంకెళ్ళ ఉచ్చు వీడాలే    

కోకిల @జిమెయిల్.కామ్




ఆకాశ స్క్రీన్ పై 
సూర్యుడు లాగిన్ అవ్వగానే 

బ్రెడ్ ముక్కల్ని 
బ్రేక్  లేకుండా ఫాస్ట్ గా  కానిచ్చి 

ఇయర్ ఫోన్ పాటలకు  
లయబద్దంగా క్యాట్  వాక్ చేస్తూ 
నిస్త్రంత్రి యుగంలోకి 
అడుగు పెట్టింది కోకిల 
కంప్యూటర్ ని  
కనుపాపలలో పొదుగుకొని 
కీ బోర్డు పై తరంగ నాట్యం చేస్తూ 
నెట్ వట వృక్షంపై
వెబ్ సైట్ గూళ్ళ అన్వేషణ 

మెరుపు వేగం తో 
విశ్వాన్ని చుట్టే 
మేధో సంపత్తి తన సొంతం 
మనో భావాల తాయిలాన్ని 
బ్లాగుల్లో భద్రపరచడం 

లిప్త కాలం లో 
ఇ-మెయిల్ లో కబురంపడంలో 
అందె వేసిన చేయి 
మాట్రిమోని ప్రొఫైల్స్ లో
భాగస్వామిని ఎన్నుకొని 
వెబ్ కెమెరా ముందు చాటింగులు 
ఆగ మేఘాల మీద అక్షింతలు 
తన జీవితాన్ని తానే 
సెట్టింగ్ చేసుకోగల 
అవసరమైతే ఫార్మాట్  చేసుకోగల 
నిపుణి 
అనుభందాలను డిలీట్ చేయడం 
స్నేహాన్ని కట్ చేయడం 
పేస్ట్  చేయడం 
పాత తరాన్ని రీసైకిల్ బిన్ లో 
వేయడం  అలవాటే
తోలి ఉగాదికి
తన బెటర్ ఆఫ్ కి   
రెడిమెడ్ పచ్చడిని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ 
నుండి తెప్పించిది 
బొంజాయి మామిడి ఆకుల్ని 
తోరణాలుగా కట్టి 
వాల్ పేపర్ పై పకృతి సీన్ 
పెట్టుకుంది.