మట్టి పాట


గుండె భిగిసి 
ఉద్యమం పెల్లుభికితే 
నే నెట్లా భావకవిని అవుతా 
సుఖ పడ్డ నీ పాటను నే నెట్లా పాడుతా  

నా నీరు, నా మట్టి, నా సంస్కృతిని
పేయి నిండా తీనెలు తీసుకోని 
స్వాతంత్ర్య ఉషస్సు కోసం 
స్వాగత గీతం పాడాను 

పాటకు యాస అంటిందని 
మట్టి పాటకు గాయం చేశావ్ 
నీ లల్ల పాటను నా గొంతునుండి ఆశించడం.....అవ్వ !
నా పల్లవికి నేనే చరణం అవుతా 

కాలం రెక్కలపై 
అద్దిన పాదముద్రలు 
అనుభవాల పానాది పరుస్తుంటే 
ఎదలో కొత్త చిగుర్లు ఉదయించినయి 

త్యాగాల యశస్సు నరాల నిండా ఒంపుకొని 
నేను పాడే కొత్త పాటకు 
చీకటి కరిగిపోవాలే 
సంకెళ్ళ ఉచ్చు వీడాలే    

1 comment: