నమస్కారం నా పేరు శారదహన్మాండ్లు, నేను ఉపాధ్యాయురాలిని, మాది ఇందూరు జిల్లా. సాహిత్య పరిమళాలను ఆస్వాదిస్తూ సామాజిక సమస్యలపై స్పందనలను కవిత రూపం లో అల్లడం నా ప్రవృత్తి. సమాజం మనందరికి నివాసాన్ని అందించిన కల్పతరువు మూలాలను కాపాడడం ఫలాలను పంచుకోవడం సమానత్వం ప్రదర్శించడం మన భాద్యత,అందుకే నా స్పందనలను మీ ముందు ఉంచుతున్నాను ప్రతిస్పందనలను తెలియ చేయండి. ధన్యవాదాలు.
దొంతులర్ర
విస్తరాకు
చెంగల్వ
ఉట్టి
నోటు
బొడ్లె సంచిల పోకల డబ్బల దాచిన పాత నోటు దీని ముందర ఎన్ని కష్టాలు కండ్ల నీళ్ళు బొర్లి పొయినయి ఏండ్ల నాటిసంది ఎన్నుపూసోలె దైర్నమిచ్చె కాగుల గింజలోలె పానంకు నిశ్చింతమాయె బొడ్లె సంచిల బద్రంగ ఉన్నదనే పెయి మరిసి కునుకు తీస్తి గిప్పుడు గీ నోటు నడదంట మరి బత్కెట్ల నడుసుడు లోకంతీరు తెల్వని బతుకు గీ నోటు లెక్కాయె అంతా మంచికేనని పెద్దమనుసులంటున్నరు నోటుకు గింజలువోయి వస్తువు మార్పిడివస్తే నల్ల నోట్లుండయేమోంట! శారదాహన్మాండ్లు.
కార్తీక కిరణం
వెచ్చనైన కిరణమిచ్చగించ జనులు
సూర్య సమము దీప కార్యమెఱిగి
వేగు చుక్క రీతి వెల్గుచూ కార్తీక
మాసమెంత దివ్య మాస మాయె.
చిచ్చుబుడ్డి
సరదా విసిరిన చెత్తను
ఏరుతున్న బాల్యం
దొరికిన కాలని టపాసుకు
ముఖం చిచ్చుబుడ్డీ అయ్యింది
టపాకాయల రూపంలో
కాల్చిన వేల రూపాయలు
వీధి బాల్యానికి కానుకైతే
ఓ నిండు జీవితం
దీపావళిలా వెలుగుతుంది.
టపాసు
అలుముకొన్న పొగతొ ఆవిరై పవనుడు
నడక తూలె నరుడి నడత వలన
నింపె కలుషితమును దీపావళి టపాసు
చెత్త నిండి పోయి చేటు కలిగె
దీప నాట్యం
తులసి ముందు శతవత్తుల దీపం
కాగడై జయోస్తు పలుకుతున్నది
నా చేతి హారతికి నాన్న కళ్ళల్లో
దీప ప్రతిబింబం
ఆనంద బాష్పమై మెరిసింది
చీకటి తెరపై దీప నాట్యం
ప్రేక్షక నక్షత్రాలు
వావ్ అంటుంటే
చిన్నారుల కళ్ళల్లో
కాకరపువ్వొత్తుల నవ్వులు
ఈ వైభవం చూడడానికి
లక్ష్మీ దేవి నడిచివస్తుంటే
దీపాల వరుసలు
గౌరవవందనం చేస్తున్నాయి
అమవస నిషి కాస్తా
పున్నమయ్యంది.
దీపావళి శుభాకాంక్షలు.
శారదాహన్మాండ్లు
దివిలె
కుండ మీది చేతి మెండైన శేవలు
దండి రుచులు గొల్ప వండునమ్మ
కమ్మదనపు పాత ఉమ్మడి ప్రేమలో
దివిలె పండుగెంతొ దివ్యమౌను
దివిలె
పొద్దు పొడుపు తోను పోటీలు పడుచును
చల్లదనపు స్నాన మెల్లరకును
ఉసిరి దీప కాంతి కొసరి వెలుగంగ
దివిలె పండుగెంతొ దివ్యమౌను.
దసర
బంగరు మనసుల సంతోషం
ఆకు రెమ్మ మురిసింది
పల్లె తల్లి పిలువ
వలస వెనుతిరిగింది.
అలాయ్ బలాయ్ ల
పలకరింపుతో
దసరా పండుగయ్యింది.