సూక్తి

సూక్తులు రాజకీయం నేర్చుకుంటారా, తత్వశాస్త్రం తెలుసుకుంటారా, ప్రేమను అనుభూతి పొందుతారా, భక్తి రహస్యం కనిపెడతారా, జ్ఞానులవుతారా, లేదు కనీసం మనిషి మనిషిలా బ్రతికితే చాలు అని అనుకుంటున్నారా అయితే భగవద్గీత చదవండి. మనసారా ఆ గీత ప్రదాతను నమస్కరించండి.🙏🏽
దోస్తానం (స్నేహం) అడుగులో అడుగు మాటలో మాట మనసులో మనసు ఎప్పుడు కలుస్తదో అస్సలు తెల్వది గంతే ! సుఖ దుఃఖాలు కాకెంగిలై పంచుకునుడు మొదలైతది బడిలో దెబ్బలైనా బతుకు వడదెబ్బలైనా నిబ్బరంగా నిలబడడానికి తోడు నీడైతది కన్నీళ్ళకు నవ్వులద్దడం ఒక్క దోస్తానంకే తెలుసు దోస్త్ తో మౌనం కూడా మూగ భాషలాడతది ఎన్ని సార్ల కచ్చి ఎన్ని సార్ల దోస్త్ అయినా బాల్యం నుంచీ దోస్తానం కంచెలా మారి పహారా కాస్తనే ఉంటది వయసుతో పాటు సాగుతూ మరణం అంచుల వరకూ సాగే దోస్తానమున్నోళ్ళు శ్రీమంతులే దోస్త్ తో సాగే బతుకంతా పైలమే. డా. శారదాహన్మాండ్లు

మరణం

సమాగమం మరణం నా చిరకాల నేస్తం పిలవకుండానే అతిథిలా వేంచేస్తుంది ఆత్మను ప్రక్షాళనం చేసి కొత్త దేహాన్నిస్తుంది నీడలో నీడై అడుగులో అడుగై ఉంటూ అప్పుడప్పుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటుంది ఎంత స్వాంతన చుట్టూ అల్లుకున్న చీడ పీడల తాళ్ళను పుట్టుక్కున తెంపి విముక్తను చేస్తుంది చీకట్లను తరిమి పరంజ్యోతిని వెలిగిస్తుంది కొత్త దేహం కొత్త ఆట తనతో దాగుడుమూతలు మాత్రం పాతవే పాలూ నీళ్ళలా కలిసే వుంటాం నన్ను పాలను చేసి పది కాలాలు పచ్చగా నడిపించి పొంగుతున్న తరుణంలో నన్నావరించి చల్లారుస్తుంది స్నేహం అంటే ఇదే కదా నేస్తమా! మన సమాగమానికి చేతులు చాచే వుంటాయ్.

రెడ్ కార్పెట్

రెడ్ కార్పెట్ కన్నుల నిండా కాంతిని పులుముకున్నాక జగమంతా వెల్గు రేఖలే! చీకటి కాటుకలా మారి రెప్ప కింద ముడుచుకుంటది ఆశ విశ్వమెల్ల విస్తరించినప్పుడు నిరాశ దిస్టి చుక్క కావల్సిందే అడుగులను సమాయత్తపరచుకొని తూరుపువైపు పరుస్తుంటే భానుడు స్వాగతం పలుకడా! నిత్య నూత్న యవ్వనాన్ని ఎదనిండా విస్తరించుకొని పయనాన్ని ఝలిపిస్తే ఎదురీత సైతం నివ్వెరపోవాల్సిందే ఎందుకలా కాళ్ళను ముడుచుకోవడం? ఆకలిని ఒక్క చరుపు చరువు దిక్కులదిరేలా పొలికేక పెట్టి లక్ష్యా న్ని పాదాక్రాంతం చేస్తుంది. కంటి ముందు రెడ్ కార్పెట్ ను వదిలేసి ఊహల్లో పల్లకీని ఎక్కుతానంటావెందుకు నిజం వైపు దృక్కులను సంధించు విజయం బావుటాను ఎగురవేస్తుంది. కిరణం అంటేనే చీకటిని చీల్చే పిడిబాకు కదా!